తల తెగినా.. హైందవ ధర్మం వీడలేదు మరాఠా యోధుడు శంబాజీ మహరాజ్ వీరగాథ

చత్రపతి శివాజీ మహరాజ్ గురించి తెలియని భారతీయుడు ఉండడు. భరత జాతి ముద్దుబిడ్డ.. వీరత్వం, పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన మరాటా యోధుడు చత్రపతి శివాజీ. ఆయన రాజ్యపాలన చేసినంత కాలం మొగల్ రాజులతో వీరోచితంగా పోరాడాడు. అలాంటి గొప్ప యోధుడి కడుపున పుట్టిన మరో యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు. హైందవ సామ్రాజ్యం కోసం, మాతృదేశం కోసం వీరోచితంగా పోరాడి దేశానికి, ధర్మానికి ఆదర్శంగా నిలిచిన మహావీరుడు శంభాజీ. 1657, మే 14న శివాజీ, సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించారు శంభాజీ. రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యం అంతా శివాజీ తల్లి జిజియాబాయి వద్దే గడిచింది.

పిలాజీ షిర్కే కుమార్తె జివుబాయిని శంభాజీ వివాహం చేసుకున్నారు. తరువాత కాలంలో ఆమే యేసుబాయిగా పేరు మార్చుకున్నారు.1680న శివాజీ మహరాజ్ మరణించారు. శివాజీ మరణంతో ఆయన వారసుడిగా శంభాజీ అధికారం చేపట్టారు. 9 ఏళ్ల పాటు పరిపాలన కొనసాగించిన శంభాజీ తన తండ్రిలాగే హింధూదర్మం కోసం పోరాటం సాగించారు. కేవలం హిందుత్వమే కాదు న్యాయబద్ధమైన పరిపాలన కొనసాగించాడు. తన దేశభక్తి, ధైర్యం, నాయకత్వంతో అందరికీ ప్రేరణగా నిలిచారు. మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఎన్నో విధాలుగా దాడులు చేసినా వాటన్నింటికి తిప్పికొట్టాడు శంభాజీ మహరాజ్. ఇక లాభం లేదనుకొని తన కుటిలన తంత్రాన్ని ప్రయోగించాడు. మరాఠా సామ్రాజ్యంలో అతని బంధువులకు ధనం ఆశ చూపించి లొంగదీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం 1689లో మరాఠా నాయకుల సమావేశం కోసం శంభాజీ సంగమేశ్వర్ చేరుకున్నారు. అప్పటికే మాటు వేసి ఉన్న మొఘల్ సైన్యం ఆయనపై మెరుపుదాడి చేసింది.

శంబాజీని బంధించిన మొఘల్ సైనికులు అయన్ని బహదూర్‌గఢ్‌కు తీసుకెళ్లారు. 40 రోజులు పాటు మాటల్లో చెప్పలేని విధంగా అత్యంత కృూరంగా చిత్ర హింసలకు గురిచేశారు. అదే సమయంలో కృూరుడైన ఔరంగజేబు.. శంబాజీ నువు బతికి ఉండాలంటే ఈ మూడు ఆంక్షలకు కట్టుబడి ఉండాలని చెప్పాడు. ఇస్లాం మతం స్వీకరించాలి, మొఘల్ చక్రవర్తులే గొప్ప యోధులు అని ఒప్పుకోవాలి, రాజ్యాన్ని ఆస్తులను తనకు అప్పగించాలని చెప్పాడు. ఎన్ని హింసలైనా భరిస్తాను.. చావడానికైనా సిద్దమే కానీ ఆ మూడు ఆంక్షలు ఒప్పుకునేది లేదని తిరస్కరించి హర హర మహాదేవ్, జై భవానీ అంటూ నినదించాడు. దీంతో ఔరంగజేబు అహం దెబ్బదినడంతో శంబాజీని దారుణంగా చంపాలని సైనికులను చెప్పాడు. శంభాజీ శరీర భాగాలన్నింటినీ ఒక్కొక్కటిగా నరికివేశారు. గోళ్లు పెకిలించారు, శరీరాన్ని వలిచారు.

ఔరంగజేబ్ అతని సైనికులు ఎంతగా హింసిస్తున్నా శంబాజీ ఏమాత్రం తగ్గలేదు. దాంతో మరింత రెచ్చిపోయిన ఔరంగజేబు అతని సైనికులతో నాలుక కట్ చేయమన్నారు.. కళ్లు పెకిలించారు. 40 రోజుల పాటు దారుణమైన హింసలకు గురిచేసి మార్చి 11, 1689న అతని శంబాజీ మహరాజ్ తల నరికించి ఊరేగించారు. ఆయన శరీర భాగాలను ముక్కలుగా నరికి భీమానదిలో విసిరి వేశారు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి.. ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం, విధేయత అనిర్వచనీయం. అలా మరాఠా యోధుడు హిందూధర్మం కోసం పోరాడి గొప్ప యోధుడుగా చరిత్రలో నిలిచారు. ఈ మద్యనే బాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు లక్ష్మణ్ ఉటేకర్ ‘చావా’ చిత్రంతో శంబాజీ చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారు. శంబాజీ మహరాజ్ గా విక్కీ కౌశల్ నటించాడు. ఈ సినిమా చూసి థియేటర్లో ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్నారు.