ఈ మధ్య కాలంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కేటుగాళ్ళు రక రకాల మోసాలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా ఫోన్ కాల్స్ ద్వారా అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఓ టెలీ స్కామర్ తాను తీసిన గోతిలో తానే పడ్డాడు. అవతల వ్యక్తిని బెదిరించి అప్పలంగా డబ్బు సంపాదించాలని చూసి తానే డబ్బు సమర్పించుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కాన్పుర్‌కి చెందిన భూపేంద్ర సింగ్ అనే యువకుడికి ఓ ఫోన్ వచ్చింది. తాను సీబీఐ డిపార్ట్ మెంట్ కి చెందిన వాడిని అని.. నీకు సంబంధించిన అశ్లీల వీడియోలు తమ వద్ద ఉన్నాయని త్వరలో అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. ఆ కేసు క్లోజ్ చేయాలని రూ.16 వేలు ఇవ్వాలని బెదిరించాడు. అయితే అవతల వ్యక్తి మోసగాడు అని గమనించిన భూపేంద్ర సింగ్ వాడితో ఒక్క ఆట ఆడుకోవడానికి సిద్దమయ్యాడు. మరోసారి అదే బెదిరింపు కాల్ రావడంతో అమాయకంగా మాట్లాడుతూ.. సార్ ప్లీజ్ అలా చేయవొద్దు మీకు ఏంత కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్పాడు. దీంతో టెలీ స్కామర్ మరింత రెచ్చిపోయాడు.. వెంటనే డబ్బు ఏర్పాట్ చేసి తన అకౌంట్ లో వేయాలని చెప్పాడు. భూపేంద్ర సింగ్ తాను ఒక బంగారం గొలుసు తాకట్టు పెట్టానని దాన్ని విడిపించడానికి రూ. 3వేలు కావాలని, ఆ గొలుసును విడిపించి తనకు డబ్బులిస్తానని నమ్మించాడు. యువకుడు చెప్పేది నిజమే అనుకొని సైబర్ నేరగాడు వెంటనే మూడు వేలు పంపించాడు. అయితే నగల వ్యాపారి తాను మైనర్ కావడం వల్ల ఆ గొలుసు ఇవ్వడం లేదు అని అన్నాడు భూపేంద్ర. మీరు మా తండ్రిలా అతనితో మాట్లాడితే ఇస్తాడు అని సైబర్ నేరగాడితో చెప్పాడు. అందుకు సైబర్ నేరగాడు ఒప్పుకున్నాడు. అప్పటికే తన ఫ్రెండ్ ని నగల వ్యాపారిలా మాట్లాడాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇదేమీ తెలియని సైబర్ నేరగాడు నగల వ్యాపారితో మాట్లాడాడు. మరో రూ.4,480 కడితే లోన్ క్లియర్ అవుతుందని చెప్పాడు. అంతే కాదు ఆ గొలుసుపై రూ.1.10 లక్షల రుణం ఇస్తానని దానికి రూ.3 వేలు ప్రాసెస్ ఫీజు అవుతుందని చెప్పాడు. దాంతో సైబర్ నేరగాడికి మరింత ఆశపెరిగింది. మొత్తానికి భూపేంద్రకు సైబర్ నేరగాడు రూ.10 వేల వరకు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత భూపేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయపోవడంతో తానే బకరా అయ్యానని గ్రహించాడు. ఆ సైబర్ నేరగాడి పై పోలీసులకు ఫిర్యాదు చేసిన భూపేంద్ర తాను తీసుకున్న పదివేలు పేదవారికి విరాళంగా ఇస్తానని అన్నాడు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు అన్నదానికి ఇదే ఉదాహారణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.