ఈ మధ్య కాలంలో చాలా మంది ఈజీ మనీ కోసం ఎన్నో రకాల మోసాలు, దారుణాలకు తెగబడుతున్నారు. ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా భయం భయంగా ఆడుకునే జూదం ఇప్పుడు బహిరంగంగానే ఆడుతున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్స్, ట్యాబ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ఆడుతూ లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ మాయాజాలంలో పడిపోయి సామాన్యులే కాదు సెలబ్రెటీలు, ప్రభుత్వ, ఐటీ ఉద్యోగస్థులు సైతం కోట్లు నష్టపోతున్నారు. ఈ వ్యసనానికి బానిసలవుతున్న వారిలో ఎక్కువగా యువత, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలనే దురాశ ఉన్నవాళ్లు. చేపకు గాళం వేసినట్లు మొదటల వందా రెండు వందలతో మొదలయ్యే ఈ బెట్టింగ్ వ్యసనం తర్వాత లక్షల చేరుకుంటుంది. ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ ఊబిలో మునిగి తేలుతున్నారు యువత. దారుణం ఏంటేంటే కొంతమంది ఇంట్లో ఉండే మహిళలు బెట్టింగ్ యాప్స్ కి బానిసలై వేలు లక్షలు పోగొట్టుకొంటున్నారు. డబ్బు పోగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో ఎంతోమంది అమాయకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ డబ్బు పెట్టి లక్షల్లో నష్టపోయిన వారు ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
బెట్టింగ్ యాప్స్ కి మైనర్లు కూడా బానిసలై తల్లిదండ్రులకు తెలియకుండా లక్షలు పోగొట్టడంతో లబో దిబో అంటున్నారు పేరెంట్స్. నిత్యం పదుల సంఖ్యల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై పెద్ద యుద్దమే నడుస్తుంది. తాజాగా ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్నవారిపై కొరడా ఝులిపిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీలో ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఎవేర్ నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ మోసాలపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఇన్ఫ్లయెన్సర్స్ ఉంటూ ప్రజలకు మంచి చేయడం మానేసి వారిని చెడు మార్గాల వైపు తిప్పే వారిపై కోరడా ఝులిపిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లయెన్సర్స్ పై వరుసగా వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. సూర్యాపేటకు చెందిన భయ్యా సన్నియాదవ్ తో పాటు మరికొంతమంది యూట్యూబర్స్ పై కేసులు నమోదు అయ్యాయి. వరల్డ్ ట్రావెలర్ గా కెరీర్ ప్రారంభించిన భయ్యా సన్ని యాదవ్ తర్వాత బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తు కోట్లు గడించారు. ఒక్క సన్నీ యాదవ్ మాత్రమే కాదు.. చాలా మంది బెట్టింగ్ యాప్స్ తో ఈజీగా డబ్బు వస్తుందని ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.
ఈ క్రమంలోనే పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇన్‌ఫ్లూయెన్సర్లు తమపై ఎక్కడ కేసు నమోదు చేస్తారా అందోళనలో బిక్కు బిక్కుంటూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీడియోలో తొలగిస్తున్నట్లు సమాచారం. ఇక ఏపీలో వైజాగ్ కి చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ని సైతం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు గతంలో బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్ చేసిన వారిపై కూడా దృష్టి సారిస్తున్నారు పోలీసులు. నటి సురేఖా వాణి కూతురు సుప్రిత హోలీ రోజు ఓ వీడియో రిలీజ్ చేసింది. గతంలో తాను తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశానని.. అది తప్పు అని తెలుసుకొని వాటన్నింటికి గుడ్ బై చెప్పినట్లు తెలిపింది. అంతేకాదు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవారికి ఎప్పటికైనా జైలు శిక్ష తప్పదని.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వారి ఖాతాల్లో నుంచి బెట్టింగ్ యాప్స్ ని డిలీట్ చేయాలని కోరింది. ఇదిలా ఉంటే యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణు ప్రియ కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్స్ చేసింది. ఎండీ సజ్జనార్ కి ఓ నెటిజన్ వీడియోతో సహా షేర్ చేశారు. ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లయెన్సర్స్ తమకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకున్న వారు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కాకుండా బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేసి ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇలాంటి వారికి తగిన బుద్ది చెప్పి కఠిన శిక్ష విధించాలని బాధితులు, నెటిజన్లు కోరుతున్నారు.