యూట్యూబర్ హర్షసాయి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రోడ్డు వెంట గుడిసెల్లో ఉన్నవారికి, కష్టాలు పడుతున్న వారికి సర్‌ప్రైజ్ చేస్తూ డబ్బుల కట్టలు అందించే వీడియోలు ఎన్నో చేస్తూ అందరినీ ఆకర్షించాడు. సమాజంలో ఇలాంటి గొప్ప దయగల హృదయుడు ఎవరుంటారు? అని అనేలా తనదై మార్క్ చాటుకున్నాడు. హర్షసాయి ఫ్యాన్ ఫోలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
ఆ మధ్య ఓ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అంతేకాదు అందులో నటిస్తున్న నటి అతనిపై రేప్ కేసు పెట్టడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనపై కేసు నమోదు కాగానే హర్షసాయి అజ్ఞాతంలోకి వెళ్లి బెయిల్ వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. తాజాగా హర్షసాయికి మరో బిగ్ షాక్ తగిలింది. హర్షసాయిపై సైబరాబాద్ పోలీసుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తున్న ఇన్ ఫ్లూయెన్సర్లపై కొరడా ఝులిపిస్తున్నారు పోలీసులు. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
హర్ష సాయి గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. వాటిని ఆధారంగా చేసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారు డబ్బు ఆశకు పోయి ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయటం ఎంతోమంది అమాయకులు మోసపోతున్నారని.. ఆత్మహత్యలు చేసుకుంటన్నారని సజ్జనార్ అంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత తమ కెరీర్ నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై హర్షసాయి స్పందించారు. బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న నష్టాల గురించి అవగాహన కల్పిస్తున్న అధికారులకు, యూట్యూబర్లకు అభినందనలు తెలిపారు. తన వ్యూవర్స్ కి, ఫోలోవర్స్ కి నష్టం కలిగించే పనులు ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చాడు. తాను బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేయడం లేదని, భవిష్యత్ లో కూడా చేయనని అన్నారు. ఇకపై తాను కూడా బెట్టింగ్ యాప్స్ అరికట్టేందుకు తనవంతు పోరాటం చేస్తానని అన్నాడు.