‘కోర్ట్’ మూవీ రివ్యూ

తెలుగు ఇండస్ట్రీలో తనదైన న్యాచురల్ నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న నేచురల్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నాని ప్రొడక్షన్ హౌజ్ ‘వాల్ పోస్టర్’ మూవీ బ్యానర్ పై వచ్చిన సినిమా ‘కోర్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ తో తెగ హడావుడి చేస్తుంటారు. కానీ నానీ మాత్రం రిలీజ్ కి రెండు రోజుల ముందు మూవీని ప్రత్యేకంగా మీడియాకు చూపించారు. మరి ఈ కోర్ట్ డ్రామా ఎలా ఉంది? రామ్ జగదీష్ ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకున్నారన్న విషయం గురించి తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే.. మంగపతి (శివాజీ) పరువే ప్రాణంగా బతుకుతుంటాడు. పరువు కోసం దేనికైనా తెగించే కృరమైన మనస్తత్వం అతనిది. చంద్ర శేఖర్ అలియాస్ చందు (రోషన్) ఇంటర్ ఫెయిల్ అయి చిన్న చిన్న పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ బతుకుతుంటాడు. మంగపతి మేనకోడలు జాబిలీ (శ్రీదేవి అపల్లా) చందూ లైఫ్ లోకి వస్తుంది. ఫోన్ కాల్స్ ద్వారా పరిచయం అయిన వీరిద్దరూ ప్రేమలో పడతారు. అయితే జాబిలి మైనర్. వీరి ప్రేమ సంగతి జాబిలి మామ మంగపతి కి తెలుస్తుంది. చందూకి బుద్ది చెప్పాలని తన పలుకుబడి ఉపయోగించి చందూని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు. పేదవాడైన చందూ తరుపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాడు. ఒకవేళ ఏ లాయర్ వచ్చినా వారిని మంగపతి కొనేయడం.. బెదిరించడం చేస్తుంటాడు. అలాంటి సమయంలో సిటీలోనే అతి పెద్ద లాయర్ లాయర్ మోహన్ రావు (సాయి కుమార్) అసిస్టెంట్ ఈ కేసును జూనియర్ లాయర్ సూర్య తేజ (ప్రియదర్శి) వాదిస్తాడు. అసలు పోక్సో చట్టం ఏం చెబుతుంది? దీన్ని తప్పుగా ఎలా వాడుకుని అమాయకుల్ని ఇరికిస్తున్నారు? చివరకు అమాయకుడైన చందుని సూర్యతేజ ఎలా బయటకు తీసుకు వస్తాడు? కోర్టులో అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి ? అనేది సినిమా కథ.

విశ్లేషణ :
నేటి సమాజంలో టీనేజ్ లోనే ప్రేమలో పడిన జంటలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అన్నదే మూవీ థీమ్. పోక్సో చట్టం మీద అవగాహన లేక, చేసేది చట్టరిత్యా నేరం అన్నది తెలీక చాలా మంది టీనేజర్స్ ప్రమాదంలో పడిపోతున్నారు. ఫోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడంవల్ల ఎన్నో నేరాలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఓ మైనర్ అమ్మాయి తనకు ఇష్టమై ప్రేమించినా, ఆమె అంగీకారంతో ముట్టుకున్నా ఏం చేసినా అది నేరం అవుతుందని ఎంత మందికి తెలుసు? ఇదే విషయాన్ని ప్రియదర్శి పాత్రతో స్పష్టంగా తెలిపే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ కోర్ట్ సినిమాలో ప్రధాన అంశం ఈ పోక్సో చట్టమే. అయితే పోక్సో చట్టం మీద దర్శకుడు లేవనెత్తిన విమర్శలు, చట్టంలోని లూప్ హోల్స్‌ను ప్రశ్నించిన తీరు.. కోర్టు సీన్లు చాలా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు రామ్ జగదీష్ రాసుకున్న కోర్టు ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. టీనేజ్ ప్రేమను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు.

నటీనటుల పనితీరు :

ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ కథ. కుర్రాడి పాత్రలో నటించిన హర్ష రోషన్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు. నేటి అమ్మాయిలు ప్రేమ వ్యవహారంలో ఎంత అమాయకంగా ఉంటారో శ్రీదేవి అపల్లా చాలా బాగా నటించింది. ఇక కోర్ట్ సినిమాకు మొదటి నుంచి హైలెట్ గా నిలిచాడు శివాజీ. చాలా కాలం తర్వాత తెరపై కనిపించి మంగపతిగా శివాజీ తన పాత్రలో జీవించాడు. శివాజీ టైమింగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. లాయర్ సూర్యతేజగా ప్రియదర్శి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ తో చాలా అద్భుతంగా నటించాడు. సినియర్ లాయర్ గా సాయికుమార్ అద్భుతంగా నటించారు. ఈరోజుల్లో పేదవాళ్లకు సరైన న్యాయం జరగడం లేదు. సమాజంలో మంగపతి లాంటి బలమైన వ్యక్తులు చట్టాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు.

సాంకేతిక విభాగం :
నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కన్నులకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. కాన్సెప్ట్, మెసేజ్ చాలా బాగుంది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సమకూర్చిన పాటలు, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాత ప్రశాంతి తిపిర్నేని పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మొత్తానికి కోర్ట్ మూవీలో ఫోక్సో చట్టానికి సంబంధించిన ఓ మంచి మెసేజ్ ఉంది. న్యాచురల్ నాని ఓ మంచి సబ్జెక్ట్, పాయింట్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చాడు.